Thursday, November 24, 2011

'పాస్‌పోర్టులు'సేవా కేంద్రాల నుంచే... (ఆంధ్రజ్యోతి నుండి)-www.passportindia.gov.in

పాస్‌పోర్టు సేవా కేంద్రమంటే...?
హైదరాబాద్, నవంబర్ 23 : దేశ వ్యాప్తంగా పాస్‌పోర్టులకు డిమాండ్ నానాటికీ పెరిగిపోతోంది. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంతోపాటు అన్ని రాష్ట్రాల్లోని పాస్‌పోర్టు కార్యాలయాలపై ఒత్తిడి పెరుగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా పాస్‌పోర్టులు జారీ చేయడం గగనమవుతోంది. దీంతో ప్రైవేటు భాగస్వామ్యం వైపు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఫలితంగా కొన్నేళ్ల క్రితం పాస్‌పోర్టు సేవా ప్రాజెక్టు ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి.

ప్రైవేటు భాగస్వామ్యంతో పాస్‌పోర్టు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, ఈ కేంద్రాల్లో...దరఖాస్తుల స్వీకరణ నుంచి పాస్‌పోర్టు మంజూరు వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహించాలని ప్రతిపాదించారు. పోలీస్ వెరిఫికేషన్ నివేదిక అందిన తర్వాత....పాస్‌పోర్టు ముద్రణ మాత్రం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేయాలని ప్రతిపాదించారు. తీవ్ర స్థాయి తర్జనభర్జనల అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ భాగస్వామ్యంతో మొదటి దశ కింద దేశ వ్యాప్తంగా 77 పాస్‌పోర్టు సేవా కేం ద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 22 కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి బెంగళూరు, చండీఘర్, ముంబై, త్రిచి, కోయంబత్తూరు, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీ, జ లంధర్, అమృత్‌సర్‌లలో పని చేస్తున్నాయి. వాటి పనితీరు సంతృప్తికరంగా ఉండడంతో హైదరాబాద్, ఘజియాబాద్, సూరత్, కోల్‌కతా నగరాలతోపాటు మరి కొన్ని ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో 6 ' సేవా కేంద్రాలు'
మనరాష్ట్రంలోని హైదరాబాద్(3), తిరుపతి(1), నిజామాబాద్(1), విజయవాడ(1)లలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ నిర్ణయించింది. దానికి అనుగుణంగా హైదరాబాద్‌లోని బేగంపేట్, అమీర్‌పేట్, టోలిచౌకిలలో పాస్‌పోర్టు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 9 నుంచి బేగంపేట్ పాస్‌పోర్టు సేవా కేంద్రంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

అది విజయవంతం కావడంతో ఈ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించా రు. మంగళవారం నుంచి అన్ని రకాల దరఖాస్తులనూ స్వీకరిస్తున్నారు. అమీర్‌పేట్, టోలిచౌకి, విజయవాడ, తిరుపతి, నిజామాబాద్ పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ఈనెల 21 నుంచి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈనెల 25 నుంచి వీటిని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ప్రస్తుతానికి యూజర్ చార్జీలు లేవు
పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో ప్రస్తుతానికి ఎటువంటి యూజర్ చార్జీలు వసూలు చేయడం లేదు. ఇప్పటి వరకు వసూలు చేస్తున్న రుసుం మాత్రమే చెల్లించాలి. అయితే కొద్ది రోజుల తర్వాత అదనంగా 200 రూపాయిల యూజర్ చార్జీలు వసూలు చేస్తారని ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి ప్రకటించారు. దాంతో దరఖాస్తుదారులు ఆ భారాన్ని మోసేందుకు సిద్ధం కావాలి.

7గంటల పాటు సేవలు
పాస్‌పోర్టు సేవా కేంద్రాలు దరఖాస్తుదారులకు రోజుకు ఏడు గంటల పాటు సేవలందించనున్నాయి. 25 కౌంటర్ల వరకు ఉండే ఈ కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పౌరులు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ కేంద్రాలు పని చేస్తాయి. శనివారం, ఆదివారం సెలవు దినాలు.

అధీకృత ఏజెంట్లకు చెక్
పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో అధీకృత ఏజంట్ల కార్యకలాపాలకు చెక్ పడింది. ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో ఉన్న 100 మంది అధీకృత ఏజంట్ల కార్యకలాపాలు నిలిపేస్తున్నామని, పాస్‌పోర్టు సేవా కేంద్రాలకు వారిని అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. దాంతో ఇక నుంచి పాస్‌పోర్టు కావాల్సిన వాళ్లు ... సాధారణ పౌరులైనా, ఢిల్లీ స్థాయి నాయకులైనా సరే పాస్‌పోర్టు సేవా కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడి దరఖాస్తు చేసుకోవలసిందే. పాస్‌పోర్టు సేవా కేంద్రంలో దరఖాస్తుదారుడు త ప్పనిసరిగా ఫొటో దిగాలి. వేలి ము ద్రలు ఇవ్వాలి. దానివల్ల ఎవరినో పం పించి దరఖాస్తు చేసుకోవడానికి వీలు పడదు.

'ప్రత్యేక ' ప్రతిపాదన
ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం ప్రాముఖ్యత దెబ్బ తినకుండా ఉండడం కోసం, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు తదితరుల సౌలభ్యం కోసం దేశంలోని అన్ని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రాలకు చెందిన పాస్‌పోర్టు అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు....ఈమేరకు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

--
k.karthik

www.Ldcomputers.in

0 comments:

Post a Comment