నైపుణ్యం గల ఇంజినీర్లు కరవు
లక్షల్లో పట్టాలు తీసుకుంటున్నా కొందరికే ఉద్యోగాలు
బోధన, మౌలిక సదుపాయాలు పట్టని కాలేజీలు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి ఉపాధి అవకాశాలు దొరకని అభ్యర్థులకు రాష్ట్రంలో కొదవలేదు. కొందరు చెప్పులరిగేలా పరిశ్రమల చుట్టూ తిరుగుతుంటే... ఇంకొందరు బాగాతక్కువ జీతానికైనా చిన్నాచితక ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ముగిసిన విద్యాసంవత్సరంలో లక్షమందికిపైగా (2007-08 బ్యాచ్) ఇంజినీరింగ్ పట్టాలతో బయటకొచ్చారు. వీరిలో 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే ఉద్యోగవకాశాలు లభించాయని అంచనా. మరో 20 శాతం మంది ఉన్నత విద్యపై దృష్టి సారించారు. మిగిలిన వారంతా ఉద్యోగాల అన్వేషణలో ఉన్నారు. ఈ క్రమంలో 2011-12 కొత్త విద్యా సంవత్సరంలో 2,07,000 మంది ఇంజినీరింగ్ కోర్సులో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరికి సుమారు 720 కళాశాలల్లో 3,15,000 సీట్లు ఆహ్వానం పలుకుతున్నాయి. 2014-15 నాటికి వీరు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేస్తారు.
కాలేజీల్లో సదుపాయాలు సున్నా...
రాష్ట్ర ఇంజినీరింగ్ కళాశాలల్లో పక్కాగా మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలు, అర్హులైన అధ్యాపకులు ఉన్నవాటిని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. ఏఐసీటీఈ ప్రకారం గణిస్తే...నాలుగు సంవత్సరాల్లోని విద్యార్థులకు కలిపి బోధించేందుకు 1:15 నిష్పత్తిలో అరవైవేల మంది అధ్యాపకుల సేవలు అవసరం. ఇందుకు తగినట్లు అధ్యాపకులు లేరు. ముఖ్యంగా పీహెచ్‌డీ చేసిన అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది.
కంపెనీలు కోరే నైపుణ్యం ఏదీ?
నియామకాల సమయంలో కంపెనీలు... కళాశాలల నేపథ్యం, విద్యార్థులు ఆంగ్ల భాషా ప్రావీణ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యం, మారుతున్న సాంకేతికతను ఆకళింపు చేసుకుని పనిచేయాలన్న ఆసక్తి ఉన్నది లేనిదీ గమనిస్తున్నాయి. ఈ అంశాల్లో రాష్ట్ర విద్యార్థులు బాగా వెనుకబడిపోతున్నారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహించే విషయంలో కళాశాలల యాజమాన్యాలు తగిన శ్రద్ధ చూపడంలేదు.
యాభై కళాశాలల్లోపే...!
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు 720 వరకు ఉన్నా ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల దృష్టి మాత్రం కేవలం యాభై కాలేజీలపైనే దృష్టి సారిస్తుండడం గమనార్హం. వీటిలో క్యాంపస్ ఇంటర్వ్యూలకు మాత్రమే ఆసక్తి కనబరుస్తున్నాయి. అత్యధిక కళాశాలలు ఉద్యోగావకాశాల కల్పనకు దూరంగా ఉన్నాయి. 2010-11లో దేశవ్యాప్తంగా ఐటీ కంపెనీలు లక్షన్నర నియామకాలు నిర్వహించాయి. మొత్తం నియామకాల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ల వాటా 60-70 శాతం ఉంటుంది. అంటే దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నేరుగా ఉద్యోగాల్లోకి వెళ్తున్న వారు 90 వేల నుంచి 1.05 లక్షల వరకు ఉంటారని పరిశ్రమ వర్గాల అంచనా. రాష్ట్రంలో గతేడాది ఇదే లెక్కన 20 నుంచి 25 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఐటీ కంపెనీల్లో ఉద్యోగ ధ్రువీకరణ పొంది ఉంటారని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఏ ఒక్క కంపెనీ కూడా నియామకాల కోసం అన్ని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లలేదు. మేము నియమించే ప్రతినిధి బృందం కళాశాలల్లోని ప్రమాణాలను పరిశీలించి అక్రిడేషన్ ఇస్తుంది. గత ఏడాది 45 కళాశాలల్లో ఎంపికలు నిర్వహించాం. ఒక్కో కళాశాలకు ప్రధానంగా బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ఆన్‌లైన్ పరీక్షకు సదుపాయాలను ప్రామాణికంగా తీసుకుంటాం. గత ఏడాది ఆంధ్రప్రదేశ్ నుంచే టీసీఎస్ 5,500 నియామకాలు చేపట్టింది
--
k.karthik
www.Ldcomputers.in


0 comments:
Post a Comment