నిత్యం రూ.కోట్లలో స్వాహా
విశాఖపట్నం - న్యూస్‌టుడే
ఎలా చేస్తారంటే... రైల్వేస్టేషన్లు, శాటిలైట్ కౌంటర్ల నుంచి జారీ చేసే టికెట్లను 'ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ' (పి.ఆర్.ఎస్.) టికెట్లు అంటారు. అదే అంతర్జాలం ద్వారా ఆన్‌లైన్‌లో తీసుకుంటే వాటిని ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్ (ఇ.ఆర్.ఎస్.) అంటారు. సూక్ష్మంగా వీటినే ఇ-టికెట్లుగా పిలుస్తారు. అంతర్జాలం ద్వారా తీసుకునే టికెట్లను మామూలుగా రద్దు చేసుకోవడం వీలుకాదు. పి.ఆర్.ఎస్. టికెట్లను దేశంలో ఎక్కడైనా రైల్వే కౌంటర్ వద్ద రద్దు చేసుకోవచ్చు. ప్రయాణికుల వెసులుబాటు కోసం 'భారతీయ రైల్వే ఆహార విహార సంస్థ' (ఐ.ఆర్.సి.టి.సి.) వెబ్‌సైట్ ద్వారా భారతీయ రైల్వే ఇ-టికెట్లను జారీచేస్తోంది. ఎవరు టికెట్ బుక్ చేస్తే వారి ఇ-మెయిల్‌కు ఇ-టికెట్ వస్తుంది. దాని ప్రింటవుట్ తీసుకుని ప్రయాణించాలి. కొంతమంది ఘరానా దళారులు తమ తెలివిని ఉపయోగించి, పి.ఆర్.ఎస్. టికెట్లలో ఉన్న వివరాలతో ముమ్మూర్తులా ఇ-టికెట్టును తలపించే టికెట్లను తయారు చేస్తున్నారు. కంప్యూటర్‌లో ఎం.ఎస్.వర్డ్‌లో ఏదైనా పాత టికెట్‌ను తెరిచి, దానిపై పి.ఎన్.ఆర్. సంఖ్య, రైలు సంఖ్య, ప్రయాణ తేదీ, ప్రయాణికుల పేర్లు వంటి వివరాలను వారే టైప్ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే వివరాలతో ఇ-టికెట్, స్టేషన్లో జారీచేసిన టికెట్లు సిద్ధంగా ఉంటాయి. రైలు బయల్దేరడానికి మూడు గంటల ముందు ప్రయాణికుల జాబితాతో చార్టులు ముద్రిస్తారు. వాటిలో పేర్లు కూడా వచ్చాక పి.ఆర్.ఎస్. టికెట్టును కరెంట్ రిజర్వేషన్ కౌంటర్లో రద్దు చేసుకుని ఎంత సొమ్ము వాపసు వస్తే అంతా దళారులు జేబులో వేసుకుంటున్నారు. అదే వివరాలతో ఉన్న ఇ-టికెట్‌పై ప్రయాణికులు దర్జాగా వెళ్లగలుగుతున్నారు. చార్టుల్లో వారి పేర్లు ఉంటాయి కాబట్టి ఎవరికీ సందేహం రాదు. అంటే బెర్తులన్నీ నిండిపోయినా రైల్వేకు ఆదాయం మాత్రం రాదన్నమాట. పూర్తిగా నిరీక్షణ జాబితా ఉన్న ఇ-టికెట్టుపై ప్రయాణించడానికి వీల్లేకపోవడంతో కనీసం ఒక బెర్తయినా ఖాయమైన టికెట్లనే ఎంచుకుంటున్నారు.
ఇ-టికెట్టును పోలిన టికెట్లను జారీచేసి అసలైన టికెట్టును రద్దు చేయడమనేది మూడు నెలలుగా విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లలో పరిమితంగా జరుగుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇక్కడి కంటే అనేక వందల రెట్లు ఇది విస్తరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తనిఖీల్లో కొరవడిన చైతన్యం: విషయాన్ని రైల్వే వర్గాల వద్ద 'న్యూస్‌టుడే' ప్రస్తావించగా ఇలాంటి మోసం కూడా చేయవచ్చనే ఆలోచనే తమకు ఇంతవరకు తట్టలేదని చెప్పాయి. రైళ్లలో టీటీఈలు అప్రమత్తంగా లేకపోవడంతో ఇన్ని నెలలుగా అక్రమార్కులు రూ.కోట్లలో గండి కొడుతూ రాగలిగారని అంగీకరించాయి.
ఈ-టికెట్ తీసుకున్నా, రిజర్వేషన్ కౌంటర్లో పొందినా ఆ మొత్తం ప్రయాణికుల పేర్లు ఒకే చార్టులో వస్తాయి. దానిలో ఎడమ పక్క ప్రయాణికుని పేరు హిందీలో, కుడిపక్క ఆంగ్లంలో ఉంటాయి. ఈ-టికెట్‌పై ప్రయాణిస్తున్నవారిని గుర్తించడానికి ^ అనే గుర్తును వారి పేరులో కలిసిపోయేలా అతి సూక్ష్మంగా ముద్రిస్తున్నారు. దీనిని ఆధారంగా చేసుకుని ఈ-టికెట్ కానివారిని, ఈ-టికెట్‌దారులను గుర్తించడం కొంత కష్టమే. సూక్ష్మంగా పరిశీలించగల సమయం ఉంటే మాత్రం టీటీఈలు దీనిని పట్టేయగలరు.
ఇలా ఎందుకు చేయకూడదు?స్టేషన్లో తీసిన టికెట్లకు, ఈ-టికెట్లకు ఒకే తరహా పి.ఎన్.ఆర్. సంఖ్యలు ఉండడం వల్ల కూడా అక్రమం సులువుగా సాగిపోతోంది. 1 నుంచి 6, 8లతో మొదలయ్యే పి.ఎన్.ఆర్. సంఖ్యలు ఇప్పటి వరకు ఉంటున్నా 7, 9, 0తో మాత్రం లేవు. వీటిలో ఏదైనా ఒక సంఖ్యను ప్రత్యేకంగా ఈ-టికెట్లకు కేటాయించగలిగినా అక్రమాలను కొంతమేర నిరోధించే వీలుంటుందని రైల్వే, ఐ.టి. వర్గాలు అభిప్రాయపడ్డాయి.
* టికెట్ సంఖ్య వద్ద ఖాళీ వదిలేసే బదులు అక్కడ ఆంగ్లంలో ఈ-టికెట్ అని ముద్రించినా మరికొంత స్పష్టత వచ్చే వీలుంది.
* లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు టీటీఈలకు అరచేతిలో ఇమిడిపోయే కంప్యూటర్లను ఇవ్వాలని నిర్ణయించారు. రిజర్వేషన్ వేళలు ముగిసాక కూడా ఈ కంప్యూటర్లలో తాజా టికెట్ల రద్దు వంటి వివరాలు ఎప్పటికప్పుడు చేరుతూ ఆ మేరకు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి బెర్తులు దొరకాలనేది అప్పటి సంకల్పం. అలాంటిది ఉన్నా టికెట్ల దందాకు అడ్డు పడేది.
--
k.karthik
www.Ldcomputers.in


0 comments:
Post a Comment